Medak church: మెదక్ చర్చికి శత వసంతాలు పూర్తి..! 15 d ago
ఆసియా ఖండంలోనే అత్యంత పురాతనమైనది, అతిపెద్ద డయాసిస్(దక్షిణ భారతదేశంలో కొన్ని క్యాథలిక్ చర్చిలకు కేంద్రం) అయిన మెదక్ చర్చికి 100 సంవత్సరాలు పూర్తయ్యాయి. మెదక్ చర్చిని ఛార్లెస్ వాకర్ పాస్నెట్ అనే ఇంగ్లాండ్ దేశస్థుడు 1914లో నిర్మాణం ప్రారంభించగా 1924లో పూర్తయ్యింది. ఈ చర్చిని డిసెంబర్ 25న ప్రారంభించారు. చర్చి నమూనాను ఐరోపా గోథిక్ శైలిలో ఆంగ్ల ఇంజినీర్ బ్రాడ్ షా రూపొందించగా, వాస్తుశిల్పిగా థామస్ ఎడ్వర్డ్ వ్యవహరించారు. చర్చి నిర్మాణంలో వాడిన పాలరాయిని ఇంగ్లండ్, ఇటలీ నుంచి తీసుకొచ్చారు. రాళ్లు, డంగు సున్నంతో 200 అడుగుల పొడవు, 100 అడుగుల వెడల్పుతో రెండంతస్తులతో రూపుదిద్దుకున్న ఈ ప్రార్థనాలయానికి 175 అడుగుల ఎత్తున్న గోపురం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది.
ఈ చర్చిలో ఒకేసారి 5,000 మంది ప్రార్థన చేసుకోవచ్చు. లోపల ప్రతిధ్వని రాకుండా రబ్బరు, పత్తిని వినియోగించి పైకప్పును వేశారు. చర్చి ప్రధాన ద్వారానికి స్వాగత తోరణాన్ని సికింద్రాబాద్ వాసులు, దిర్జీ కంపెనీకి చెందిన ఇద్దరు హిందూ సోదరులు నిర్మించారు. చర్చిలోపల నాటి చెకోస్లోవేకియా కళాకారులు దేవదారు కర్రతో పక్షిరాజు ఆకారంలో తీర్చిదిద్దిన బైబిల్ పఠన వేదిక, రంగూన్ టేకుతో తయారైన ప్రభు భోజనం బల్ల, వెలుగులు విరజిమ్మే షాండ్లియర్లు ప్రత్యేకతలు చాటుతున్నాయి. దేశంలో మెదక్ చర్చి తర్వాత అంతటి ప్రత్యేకత మహబూబాబాద్ జిల్లాలో డోర్నకల్ సీఎస్ఐఐకి ఉంది. 1915, జనవరి 14వ ఎపిఫని కేథడ్రల్ పేరిట నిర్మాణమైన ఈ చర్చి 1939లో పూర్తైంది.